Loading...
15 Feb
1. దేవా, చెవి యొగ్గి నా ప్రార్థన ఆలకింపుము నా విన్నపమునకు విముఖుడవై యుండకుము.

2. నా మనవి ఆలకించి నాకుత్తరమిమ్ము.

3. శత్రువుల శబ్దమునుబట్టియు దుష్టుల బలాత్కారమునుబట్టియు నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగు చున్నాను.వారు నామీద దోషము మోపుచున్నారు ఆగ్రహముగలవారై నన్ను హింసించుచున్నారు.

4. నా గుండె నాలో వేదనపడుచున్నది మరణభ యము నాలో పుట్టుచున్నది

5. దిగులును వణకును నాకు కలుగుచున్నవి మహా భయము నన్ను ముంచివేసెను.

6. ఆహా గువ్వవలె నాకు రెక్కలున్న యెడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే

7. త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని

8. అరణ్యములో నివసించి యుందునే అనుకొంటిని.

9. పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టిపనులు చేయువారిని నిర్మూలము చేయుము వారి నాలుకలు ఛేదించుము.

10. రాత్రింబగళ్లు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి.

11. దాని మధ్యను నాశన క్రియలు జరుగుచున్నవి వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి.

12. నన్ను దూషించువాడు శత్రువుకాడు, శత్రువైన యెడల నేను దాని సహింపవచ్చును. నా మీద మిట్టిపడువాడు నా యందు పగపట్టిన వాడు కాడు అట్టివాడైతే నేను దాగియుండ వచ్చును.

13. ఈ పని చేసిన నీవు నా సహకారివి నా చెలికాడవు నా పరిచయుడవు.

14. మనము కూడి మధురమైన గోష్ఠి చేసియున్నవారము ఉత్సవమునకు వెళ్లు సమూహముతో దేవుని మందిరమునకు పోయియున్నవారము.

15. వారికి మరణము అకస్మాత్తుగా వచ్చును గాక సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోవుదురు గాక చెడుతనము వారి నివాసములలోను వారి అంతరంగమునందును ఉన్నది.

16. అయితే నేను దేవునికి మొఱ్ఱపెట్టుకొందును యెహోవా నన్ను రక్షించును.

17. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొఱ్ఱపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన నాలకించును.

18. నా శత్రువులు అనేకులై యున్నారు అయినను వారు నా మీదికి రాకుండునట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి యున్నాడు.

19. పురాతనకాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు, మారుమనస్సు లేనివారై తనకు భయపడనివారికి ఉత్తరమిచ్చును.

20. తమతో సమాధానముగా నున్నవారికి వారు బలాత్కారము చేయుదురు తాము చేసిన నిబంధన నతిక్రమింతురు.

21. వారి నోటి మాటలు వెన్నవలె మృధువుగా నున్నవి అయితే వారి హృదయములో కలహమున్నది. వారి మాటలు చమురుకంటె నునుపైనవి అయితే అవి వరదీసిన కత్తులే.

22. నీ భారము యెహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొనును నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు.

23. దేవా, నాశన కూపములో నీవు వారిని పడవేయుదువు రక్తాపరాధులును వంచకులును సగముకాలమైన బ్రదుకరు. నేనైతే నీ యందు నమ్మికయుంచి యున్నాను.
 
Telugu