Loading...
09 Apr
1. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. 

2. దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి యొక పట్టణములో ఉండెను. 

3. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చినా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచు వచ్చెను గాని 

4. అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు-నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయు ఉండినను 

5. ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాననుకొనెను.

6. మరియు ప్రభువిట్లనెను- అన్యాయస్థుడైన ఆ న్యాధిపతిని చెప్పి మాట వినుడి. 

7. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొఱ్ఱపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? 

8. ఆయన వారికి తర్వగా న్యాయము తీర్చును; వారి విషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్యకుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? 

9. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని యితరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. 

10. ప్రార్ధన చేయుటకై యిద్దరు మనుష్యులు దేవాలయమునకు వెళ్లిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి.

11. పరియ్యుడు నిలువబడి - దేవా, నేను చోరులను అన్యాయస్థులను వ్యభిచారులునైన యితర మనుష్యులవలెనైనను, ఈ సుంకరివలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

12. వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను.

13. అయితే సుంకరి దూరముగా నిలుచుండి, ఆకాశమువైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు - దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను.

14. అతనికంటె ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన యింటికి వెళ్లెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబ డుననియు తన్ను తాను తగ్గించుగొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను.

15. తమ శిశువులను ముట్టవలెనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసికొనిరాగా ఆయన శిష్యులు అది చూచి తీసి కొనివచ్చిన వారిని గద్దించిరి. 

16. అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియ్యుడి, దేవుని రాజ్యము ఈలాటి వారిది. 

17. చిన్న బిడ్డవలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. 

18. ఒక అధికారి ఆయనను చూచి - సర్వోన్నతుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయననడిగెను. 

19. అందుకు యేసు - నేను సత్పురుషుడనని యేల చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుకాడు. 

20. వ్యభిచరింపవద్దు, నరహత్యచేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, నీ తలిదండ్రులను సన్మానింపుమను ఆజ్ఞలను ఎరుగుదువు గదా అని అతనితో చెప్పెను. 

21. అందుకతడు - బాల్యమునుండి వీటన్నిటిని అనుసరించుచునే యున్నాననెను. 

22. యేసు విని - నీకింక ఒకటి కొదువగా వున్నది, నీకు కలిగియున్నవన్నియు అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పెను. 

23. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా

24. యేసు అతని చూచి - ఆస్తిగలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము.

25. ధనవంతుడు దేవుని రాజ్యములొ ప్రవేశించుట కంటె సూదిబెజ్జములో ఒంటె దూరుట సులభమని చెప్పెను. 

26. ఇది విననవారు - ఆలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా

27. ఆయన - మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పెను. 

28. పేతురు ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమనగా 

29. ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై యింటినైనను భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రుల నైనను పిల్లలనైనను విడిచిపెట్టినవాడెవడును. 

30.ఇహమందు చాల రెట్లును పరమందు నిత్యజీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. 
Telugu