Loading...
Dr. Paul Dhinakaran

జీవజలములు మీ ఆత్మను తృప్తిపరచును!

Dr. Paul Dhinakaran
09 Jan
నా ప్రియులారా, జీవం ఒక ప్రాణిలో ఉండును. కానీ, జీవపు ఊట దానిని సృష్టించిన సృష్టికర్తలోనే ఉన్నది. మన జీవితము ప్రభువైన క్రీస్తుతో నిండినట్లయితే, మన జీవితము మృతమైనది కాదు. మనము దేవుని వెలుగును చూస్తాము. అందుకే బైబిలేమంటుందో చూడండి, " నీ యొద్ద జీవపు ఊట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము '' (కీర్తనలు 36:9) అన్న వచనము ప్రకారము, అంధకారములోనున్న జీవితం, బాధతోను, దురాత్మల ఒత్తిడిచేతను నింటియుండును. కానీ, ప్రభువు మాత్రమే ఆధ్యాత్మిక జీవితమును మరియు సహజమైన తెలివిని ఇవ్వగలడు. ఆయన ఒక్కడే, మీ జీవితమును ఆశీర్వాదముగా ఉండునట్లు ప్రకాశింపజేయగలడు. దేవుని వెలుగు ద్వారా మాత్రమే ఆయనకు విరోధముగా సణగకుండా, మన జీవితాలపట్ల ఉన్న దేవుని ఉద్దేశాన్ని అర్థం చేసుకోగలము. మనము కొవ్వొత్తి వెలుగులో సూర్యుని చూడవలసిన అవసరము లేదు. దాని ప్రకాశములోనే మనము చూడగలము. అదేవిధముగా, మనము యేసును మన వెలుగుతో స్వయంగా చూడలేము గానీ, యేసు యొక్క వెలుగుతోనే ఆయనను చూడగలము. 

యేసుక్రీస్తు ఒకసారి, ఒక బావి యొద్దకు వచ్చి సమరయ స్త్రీని కలిసి, ఆమెతో సంభాషించెను. ఆయన, ఆమెతో " ఆ నీళ్లు దయచేయమని అడుగుచున్నావు కదా! వెళ్లి, నీ పెనిమిటిని తీసుకొని రా '' అని చెప్పెను. అందుకు ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనెను. యేసు ఆమెతో, " నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు అయిదుగురు పెనిమిట్లుండిరి. ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెనను. '' నాకెంతో ప్రియమైన వారలారా, ఆ స్త్రీ సంతోషకరమైన మరియు సమాధాకరమైన జీవితము కొరకు దప్పికగొనియున్నది. కానీ, ఆమె వివాహం చేసుకొనిన ఐదుగురు భర్తలు ఆమెకు సంతోషమును ఇవ్వలేకపోయారు. ఆ విధంగా ఆమె జీవపు ఊట కొరకు దప్పికగొని యుండెను. మరియు యేసు ఆమెకు జీవపు ఊటను అనుగ్రహించినప్పుడు, ఆమె జీవితం మారిపోయింది. మీరు కూడ ఇదే నావలో పయనించుచున్నారా? " అయ్యో, నా కుటుంబములో సమాధానం లేదు, నా కుటుంబం నాశనమై పోవుచున్నది '' అని బాధపడుచున్నారా? దిగులుపడకండి, జీవపు ఊటయైన యేసు యొద్దకు రండి, నిశ్చయముగా, మీరు ఎన్నటికిని దాహము గొనరు. 
నా ప్రియ స్నేహితులారా, ప్రభువైన యేసు, " నేను ఈ లోకమునకు వెలుగైయున్నాను. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగియుండును '' (యోహాను 8:12) అని సెలవిచ్చుచున్నాడు. ఈనాడు జీవ జల నది అయిన యేసుని తట్టు చూడండి, ఆయన నుండి మీరేమియు దాచలేరు. మీ తలంపులన్నిటిని ఆయన ఎరిగియున్నాడు. సమరయ స్త్రీవలె నేడు ఈ సందేశము చదువుచున్న మీరు కూడ జీవపు ఊటలను అనుగ్రహించమని దేవుని అడగండి. జీవపు ఊటలను సంపూర్ణంగా ఇచ్చే యేసు యొద్దకు వచ్చిన ఆ స్త్రీ జీవితమును మార్చివేసిన ప్రకారము యేసు నేడు మీ జీవితమును కూడ మార్చివేస్తాడు. మీరు మళ్లీ దప్పిగొనరు. ఇందునిమిత్తమే ప్రభువైన యేసు ఈ లోకమునకు వచ్చెను. కాబట్టి, ఒకవేళ మీ జీవితము పాపముతో నిండి యున్నట్లయితే, మీరు దేవుని యొద్దకు వచ్చినట్లయితే, చీకటితో నిండిన మీ జీవితానికి ఆయన వెలుగునిచ్చి, మిమ్మల్ని జీవపు ఊటగా మారుస్తాడు. 
Prayer:
ప్రేమా నమ్మకము కలిగిన మా ప్రియ ప్రభువా! 

కీర్తనాకారుడు జీవజల ఊటలను అనుభవించిన ప్రకారముగాను, జీవజలముల ద్వారా సమరయ స్త్రీ జీవితం మారిన ప్రకారముగా, నేడు మేము కూడ నీ యొక్క జీవజలములను అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. మా పాపపు జీవితాన్ని నీ యొక్క దివ్యమైన హస్తాలకు సమర్పించుకొనుచున్నాము. మమ్మును నీ బిడ్డగా మార్చుకొనుము. ఆత్మ దాహము కలిగియున్న మా జీవితాల మీద నీ యొక్క జీవజలములను కుమ్మరించి, మా ఆత్మను తృప్తిపరచుము. మా జీవితములో ఉన్న చీకటిని తొలగించి, నీ వెలుగును చూచే జీవితమును మాకు దయచేయుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్. 

1800 425 7755 / 044-33 999 000