Loading...
Paul Dhinakaran

తల్లిదండ్రులపై విధేయత చూపుట ప్రేమకు చిహ్నం!

Dr. Paul Dhinakaran
17 May
నా ప్రియ స్నేహితులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ప్రతి ఒక్కరి పట్ల విధేయత కలిగి జీవించాలి. విధేయత చూపుట ప్రేమకు చిహ్నంగా ఉన్నది. మరిముఖ్యముగా మీ తల్లిదండ్రులకు విధేయులై వారికి లోబడి జీవించాలి. అందుకే బైబిలేమంటుందో చూడండి, " నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము నీ తల్లి చె ప్పు బోధను త్రోసివేయకుము '' (సామెతలు 1:8) అన్న వచనము ప్రకారము నేడు ఈ సందేశము చదువుచున్న మీరు మీ తల్లిదండ్రుల ఉపదేశమును ఆలకించినట్లయితే, " అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములునై యుండును '' (సామెతలు 1:9) అని భక్తుడు మనకు స్పష్టముగా తెలియజేయుచున్నాడు. తల్లిదండ్రుల ఉపదేశమును ఏమి చేయాలని వాక్యము మనకు తెలియజేయుచున్నదో చూడండి, " వాటిని ఎల్లప్పుడు నీ హృదయమునందు ధరించుకొనుము నీ మెడచుట్టు వాటిని కట్టుకొనుము. నీవు త్రోవను వెళ్లునప్పుడు అది నిన్ను నడిపించును నీవు పండుకొనునప్పుడు అది నిన్ను కాపాడును. నీవు మేలుకొనునప్పుడు అది నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు '' (సామెతలు 6:20-23) అన్న వచనముల ప్రకారము తల్లిదండ్రుల ఉపదేశములు మిమ్మును సురక్షితముగా కాపాడును. కావుననే, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు మీ తల్లిదండ్రుల పట్ల విధేయత చూపండి. ప్రేమకు చిహ్నంగా మారండి. వారిని తృణీకరించకుండా, ఘనపరచండి. నిశ్చయముగా మీ జీవితములో అద్భుతములు కుమ్మరించబడును. 

మైఖేల్ చంగ్, తన 17 సంవత్సరముల వయస్సులోనే ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంటులో చాంపియన్ అయ్యాడు. విలేకరులు అతనిని ఇంటర్య్వూ చేశారు. " నా జీవితములో విజయమునకు కారణము నా తండ్రి. నేను ప్రాక్టీసుకు వెళ్లినప్పుడు, ఆయన ఎల్లప్పుడు నాతో ఉండేవారు. ఆదివారములలో ఆయన నన్ను దేవుని మందిరానికి తీసుకొని వెళ్లేవారు. ఆయన నాకు యేసును గూర్చి బోధించేవారు. ఆయన నా తప్పులను నాకు తెలియజేసేవారు. నేను ఎల్ల్లప్పుడు నా కోచ్ సలహాలను అదే సమయములో నా తండ్రి సలహాను పాటించేవాడను. కనుకనే దేవుడు నన్ను టెన్నిస్లో చాంపియన్గా ఘనపరిచాడు. నా హృదయము ఆనందముతోనిండి పోయింది '' అని చెప్పాడు. 
అదే విధముగా, మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకములో జీవించినప్పుడు ఆయనకు ముప్పై సంవత్సరముల వయస్సు వరకు తన తల్లిదండ్రులతోనే ఉండి, వారికి అన్ని విషయాలలో సహాయము చేయుచు, వారి పనులలో వారికి సహకరించుచు ఉండెను. అటుతరువాత ఆయన పరిచర్య చేయుటకు వెళ్లెను. యేసు ప్రభువు దేవుని కుమారుడై యుండి కూడ ఆయన ఎల్లప్పుడు తన తల్లిదండ్రులను ఘనపరిచేవాడు. ఆయన కల్వరి సిలువలో శ్రమపడుచున్న సమయములో కూడ తన తల్లిపట్ల బాధ్యతను నెరవేర్చాడు. తన యొక్క బాధ్యతను తన ప్రియ శిష్యునికి అప్పగించెను (యోహాను 19:26,27). 

కనుకనే, నా ప్రియ స్నేహితులారా, యేసుక్రీస్తే మనకు మాదిరిగా జీవించెను. కాబట్టి, మనము కూడ ఆయనను అనుసరించి, మన తల్లిదండ్రులను గౌరవించాలి. ఒకవేళ నేడు ఈ సందేశము చదువుచున్న మీరు మీ తల్లిదండ్రుల ఉపదేశమును త్రోసివేసియున్నారా? వారిని తృణీకరించియున్నారా? మీ తల్లిని తండ్రిని దూషించియున్నారా? తద్వారా వారి హృదయాన్ని బాధపెట్టియున్నారా? " మీ తల్లిని తండ్రిని దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును '' (సామెతలు 20:20) వ వచనములో చెప్పబడినట్లుగా, నేడే మీరు మీ తల్లిదండ్రుల పట్ల క్షమాపణ కోరండి. అంతమాత్రమే కాదు, వారి సలహాలు ఆలకించి, బాగా చదివి, యథార్థముగా జీవించినప్పుడు, నేడు ఈ సందేశము చదువుచున్న మీ జీవితము అభివృద్ధి నొందును. సంతోషము సమాధానములతో నింపబడుదురు. నేడు మీరు ఎటువంటి ఓటమిలను ఎదుర్కొనుచున్నను సరే, మీరు ఎప్పుడైతే, మీ తల్లిదండ్రులకు విధేయత చూపుతారో, అప్పుడు మీ జీవితములో విజయమును సాధించెదరు. మరియు మీరు విజయము సాధించినప్పుడు, మీ తల్లిదండ్రులను ఘనపరచుటకు మరువకండి. మరియు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించండి. దేవుడు మిమ్మును ఆశీర్వదిస్తాడు. 
Prayer:
ప్రేమామయుడవైన మా ప్రియ పరలోకపు తండ్రీ, 

అనుదినము, నీ ఆశీర్వాదకరమైన వాక్యము ద్వారా మాతో మాటాలాడుచున్నందుకై నీకు స్తోత్రములు. మా తల్లిదండ్రులకు లోబడి, వారిని ఘనపరచుటకు మమ్మును నీ పరిశుద్ధాత్మతో నింపుము. మేము వారిని బాధపెట్టకుండుటకు మాకు సహాయము చేయుము. ఈ లోకములో మాకిచ్చిన తల్లిదండ్రులు విలువైన బహుమతి అని మేము గ్రహించాము. వారు ఎంతో ప్రత్యేకమైనవారు మరియు వారు మా జీవితములో చేసిన సహాయమును బట్టి వారికి మేము కృతజ్ఞులమై యుండుటకు మాకు సహాయము చేయుము. ఒకవేళ మేము ఇంతవరకు వారిని ఘనహీనంగాను, వారి మాటలకు లోబడకుండా అవిధేయత చూపినట్లయితే, దయతో మమ్మును క్షమించుము. ఈ భూమి మీద మాకిచ్చిన బహుమతియైన వారిని ఇంకా అధికముగా ఘనపరచుటకు మాకు అటువంటి కృపను అనుగ్రహించుమని యేసుక్రీస్తు ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్. 

1800 425 7755 / 044-33 999 000