Loading...
DGS Dhinakaran

మీలో విశ్వాసాన్ని కలుగజేసే ప్రేమా కనికరముగల దేవుడు!

Bro. D.G.S Dhinakaran
13 Jun
నా ప్రియమైనవారలారా, మన దేవుడు ప్రేమా కనికరములు కలిగినవాడు. మనము విశ్వాసమును కోల్పోయినప్పుడు, మనలను ప్రేమ ద్వారా విశ్వాసముతో నింపే దేవుడు. కావుననే, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు అనుభవించు వేదనల ద్వారా సహనాన్ని కోల్పోయారా? లేక ఒకదాని వెంబడి ఒకటి శ్రమల వచ్చుట ద్వారా విశ్వాసాన్ని కోల్పోయి ఇక జీవితము ముగింపు దశకు వచ్చినదని చింతించుచున్నారా? కలవరపడకండి, ఇంకను ఈ లోకములో జీవించే ప్రతి ఒక్కరు జీవితమను పరుగు పందెములో అనుదినము పరుగెత్తాలి. కానీ ఆ పరుగు చివరికి ఎక్కడికి చేరుతుందో తెలియని స్థితిలో ఉండకూడదు. అయితే, మనకొక నమ్మకము కలదు, విశ్వాసమునకు కర్తయైన యేసు వైపు మాత్రమే మనము చూడాలి. ఇంకను విశ్వాసమునకు కర్తయై యున్న మన ప్రభువైన యేసు వైపు మన పరుగును తుదముట్టించినట్లయితే, నిశ్చయముగా, మన జీవితములో మనము విజయాన్ని సాధించగలము. విశ్వాసానికి కర్తయైన మన దేవుడు శ్రమలలో మనకు విశ్వాసాన్ని, సహనాన్ని దయచేస్తాడు. అందుకే బైబిల్లో, " ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమువలె మనలను ఆవరించియున్నందున మనము కూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తన యెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైయున్నాడు '' (హెబ్రీయులకు 12:1-2) అన్న వచనముల ప్రకారము, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఎటువంటి శ్రమలను అనుభవించు చున్నప్పటికిని, విశ్వాసమును కొనసాగించు యేసు వైపు మీరు ధైర్యంగా చూడండి, నిశ్చయముగా దేవుడు మీకు విశ్వాసమునకు ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. 

నా ప్రియులారా, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు మన ప్రభువైన యేసు క్రీస్తు ఒక్కడే! ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. "యేసుక్రీస్తునందుండు వారికి సున్నతి పొందుటయందేమియు లేదు, పొందకపోవుట యందేమియు లేదు గాని ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును '' (గలతీయులకు 5:6). ప్రభువైన యేసు యొద్ద నుండి ప్రేమ, కనికరము ప్రవహించుచున్నది. ఆయన రోగులను అనేకులను స్వస్థపరిచెనని దేవుని వాక్యమునందు ఎక్కడైతే చదివి యున్నామో అక్కడ యేసు కనికరించి, వారిని స్వస్థపరిచెనని మనము చదివెదము. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన యెదుట మోకాళ్లూని నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి, ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి, చెయ్యిచాపి వానిని ముట్టి నాకిష్టమే; నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను. అప్పుడాయన ఎవనితోను ఏమియు చెప్పకు సుమీ; కాని నీవు వెళ్లి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరచుకొని, నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించుమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేసెను. అయితే, వాడు వెళ్లి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును, ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను (మార్కు 1:40-43). దేవుని వాక్యమునందు మనకు తెలియజేసినట్లుగానే, ఒక కుష్ఠరోగి యేసు యొద్దకు వచ్చి, " ప్రభువా, నీ కిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయుము అని ఆయనను వేడుకొనెను. యేసు అతని శరీరమునందున్న గాయములను చూచి, అతని యందు కనికరపడి, " నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని '' వానితో చెప్పెను. అంతమాత్రమే కాదు, ఆయన వానిని స్వస్థపరిచెను. ఏలాగనగా, ఆయన యందున్న ప్రేమ కనికరము అతనిలో స్థిరమైన విశ్వాసమును కలిగించినది. యేసుక్రీస్తు ఒక్క క్షణములోనే అతని జీవితములో అద్భుతమును చేసెను. 
యేసుక్రీస్తు ప్రేమా కనికరములకు నిద్శనముగా మరొక సంఘటనను చూద్దాము. యేసుక్రీస్తు సీమోను అను వ్యక్తి ఇంటిలో బస చేసెను. అప్పుడు పాపాత్మురాలైన ఒక స్త్రీ ఆయన యొద్దకు వచ్చి, తన కన్నీటితో ఆయన పాదములను కడిగినది. యేసు ఆమెను చూచి, " నీ పాపములు క్షమించబడి యున్నవి. నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానముగలదానవై వెళ్లుమని '' చెప్పెను. అవును పాపము వలన ఆమె అనుభవించుచున్న వేదనను చూచి, యేసు ఆమె యందు కనికరపడెను. ఆమె జీవితమును మార్చగల విశ్వాసము ఆమె హృదయములో కలిగినది. గనుక ఆమె రక్షించబడెను (లూకా 7:38, 39,49,50).

నా ప్రియమైనవారలారా, మన యేసు ప్రేమా కనికరము కలిగిన దేవుడు, ఆయన దయగలవాడు. కనుకనే ఆయన ప్రేమ యందును, కనికరమునందును మనము నమ్మకమును కలిగియుండి, " ప్రభువా, నా హృదయములో అటువంటి విశ్వాసమును అనుగ్రహించుము '' అని మనము కూడ దేవునికి మొఱ్ఱపెట్టెదము. అప్పుడు ఆయన మనలో కదిలించలేని విశ్వాసమును నిశ్చయముగా అనుగ్రహించును. పర్వతములు తొలిగిపోయినను, కదిలించబడని ఒక దైవీక విశ్వాసమును దేవుడు మనకు అనుగ్రహించి, నేడు ఈ సందేశము చదువుచున్న మీకుగానీ, లేక మీ కుటుంబ సభ్యులలో గానీ, ఎటువంటి వ్యాధులున్నను, సరే, వాటిని ఆయనకు మీ పట్ల ఉన్న ప్రేమా కనికరము ద్వారా మీకు దృఢమైన విశ్వాసము కలిగించి, మిమ్మును ముట్టి, స్వస్థపరచి, నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పి, మీలో ఉన్న విశ్వాసమును బలపరచి, మిమ్మును పరవశింపజేస్తాడు. 
Prayer:
ప్రేమా కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రీ, 

దేవా, ఈ లోకము వైపు మేము పరుగెత్తకుండ జీవముగల దేవుని వైపు మేము పరుగెత్తుటకు కృపను చూపుము. నేటి నుండి అన్ని సమయాలలో నీవైపే చూచె కృపను మాకు దయచేయుమని వేడుకొంటున్నాము. దీని ద్వారా మేము ఈ లోకంలో మా ముందుంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరుగెత్తేందుకు కావల్సిన విశ్వాసాన్ని సహనాన్ని అనుగ్రహించుము. దేవా, మా సమస్యల మధ్య మేము మా కొండ కోటవైన నీ వైపు మా కన్నులెత్తుచున్నాము, నీవు మాకు సహాయము చేసి మమ్మును నడిపించుము. దేవా, మేము గొప్ప విశ్వాసనీయమైన జీవితమును జీవించుటకు నీ కృపను మాకు అనుగ్రహించుము, మా పరుగు పందెములో మేము ఎల్లప్పుడు జయము పొందుటకు అటువంటి విశ్వాసనీయమైన జీవితము నిమ్ము. నేడు మా శరీరములో ఉన్న వ్యాధుల నుండి నీ ప్రేమా కనికరముల ద్వారా మమ్మును ముట్టి, మాకు సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించి, మమ్మును శుద్ధులనుగా చేయుము. మా పాపము వలన కోల్పోయిన విశ్వాసాన్ని మాలో స్థిరపరచి మమ్మును సమృద్ధిగా ఆశీర్వదించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు మధురమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రీ, ఆమేన్. 

1800 425 7755 / 044-33 999 000