Loading...
Paul Dhinakaran

క్రీస్తే మీలో మహిమా నిరీక్షణయైయున్నాడు!

Dr. Paul Dhinakaran
14 Jun
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు మరియు మేము దేవునితో సహవాసము కలిగియుండాలనియు, ఆయనతో మనము కూడ ఏలాలనియు ఆయన మన పట్ల వాంఛ కలిగియున్నాడు. ఆయనతో కూడ మనము ఏల వలెననగా, మనము అన్ని విషయాలలో సహించువారముగా ఉండాలి. అనగా, ఏ కష్టము వచ్చినను, సరే, వాటన్నిటిలో మనకు ఎంతో సహనము కలిగియున్నట్లయితే, నిశ్చయముగా మనము దేవుని యొద్ద నుండి జీవకిరీటమును పొందుకుంటాము. అందుకే బైబిలేమంటుందో చూడండి, " సహించిన వారమైతే ఆయనతో కూడ ఏలుదుము '' (2 తిమోతి 2:12) అన్న వచనము ప్రకారము ఈ లోకములో శ్రమలు మనలను వెంబడించినప్పుడు దేవుని యందు నిరీక్షణ కలిగియున్నప్పుడు, ఆ గొప్ప నిరీక్షణ, సహనము మనలను ఆనందముగా జీవింపజేస్తాయి. ' క్రీస్తే మీలో మహిమా నిరీక్షణయైయున్నాడు ' అని చెప్పగలుగుచున్నారు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది '' (రోమా 5:5) అన్న వచనము ప్రకారము ఆయన యందు మనము నిరీక్షణ కలిగియున్నప్పుడు ఆ నిరీక్షణ మనలను ఎన్నటికిని సిగ్గుపరచదు. 

ఒకరోజు ఒక దైవసేవకుడు, ఆయన యొక్క కష్టములకు శోధనలకు ఒక ముగింపునిమ్మని ప్రార్థనలో వేచియుండెను. ఆయనను ఆదరించుటకు, ప్రభువైన యేసు, దర్శనములో ఆయనను పరలోకమునకు కొనిపోయెను. అక్కడ ఆయన యేసుక్రీస్తుతో ఉండి, అంతా చూస్తూ ఉన్నారు. అప్పుడు ఆయన ఒక ఆత్మ పరలోకమునకు రావడాన్ని చూశారు. ఆ ఆత్మ ఒక స్త్రీ. ఆమె వచ్చిన వెంటనే, ప్రభువు ఆయన సింహాసనము మీది నుండి దిగి వచ్చి, ఆమెను కౌగిలించుకొని, ముద్దాడి, " నా ప్రియ కుమార్తె, భూలోకములో నీవెంత కష్టపడ్డావు! కానీ, నీవు సమస్తమును భరించావు. నిజంగా నువ్వు మంచి పోరాటమును పోరాడితివి. రా, నీ యజమానుని సంతోషములో పాలుపంచుకో! '' అని చెప్పాడు. అది చూచుచున్న ఆ దైవజనుడు ఆశ్చర్యపోయాడు. యేసు ఆయనతో, " నా కుమారుడా, భూమి మీద కేవలం దుఃఖమును మాత్రమే అనుభవించింది. ఆమె భర్త ఆమెను కొట్టి భయంకరముగా హింసించాడు. కానీ, ఆమె ఒక్కసారి కూడ నన్ను తిట్టలేదు. కనుకనే, నేనే ఆమెను ఆహ్వానించాను '' అని చెప్పాడు. 
నా ప్రియ స్నేహితులారా, ఒకవేళ నేడు ఈ సందేశము చదువుచున్న మీరు ఎన్నో కష్టాలు ఒకటి వెంబడి ఒకటి మిమ్మును వె ంబడించుచున్నాయని దిగులుపడుచున్నారా? మీరు కూడ పరలోకములో అటువంటి ఆదరణను పొందు ఒక దినము వచ్చును. ఇదే మహిమా నిరీక్షణ, కష్టములు తాత్కాలికము! దేవుని ఆశ్రయించి, వాటిని సహనముతో భరించండి. దేవుడు ఎంతోకాలమునుండి మీ ప్రార్థనను ఆలకించలేదని నిరాశ చెందకండి. అన్ని పరిస్థితులలోను ఆయనను ఆశ్రయించండి. " సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించువారికి ఏమేలు కొదువయై యుండదు '' (కీర్తనలు 34:10) అన్న వచనము ప్రకారము దేవునిని ఆశ్రయించిన వారికి ఇహమందు కానీ, పరలోకమందు కానీ, ఏ మేలు కొదువైయుండదు. అంతమాత్రమే కాదు, మనము పరలోకమునకు వెళ్లు దినమున, యేసు తానే వచ్చి, " నా కుమారుడా/నా కుమార్తె, నా కొరకు నీవు సమస్త శోధనలను సహనముతో భరించావు. ఇకపై నా ఆనందములోనికి ప్రవేశించు '' అని మీ తలపై జీవ కిరీటమును ఉంచుతాడు. ఆ ఆనందముకన్న ఈ లోక కష్టాలు మనలను ఏమి చేయవు. కాబట్టి, ధైర్యముగా ఉండండి. మీ కష్టాలలో దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మును విడిపించి, పరవశింపజేస్తాడు. 
Prayer:
ప్రేమగల మా పరలోకపు తండ్రీ, 

ఈనాడు నీవు మాతో మాటలాడిన ఈ ఆశీర్వాదకరమైన మాటను బట్టి నీకు స్తోత్రములు. ప్రభువా, మా శ్రమలను సహించుటకు మాకు సహనమును అనుగ్రహించుము. మహిమాన్వితమైన దినమున మేము మా ఘనతను పొందుటకు మాకు సహాయము చేయుము. ఎంతో కాలమునుండి మమ్మును వెంబడించుచున్న ఈ కష్టాలను మా నుండి తొలగించుము. నీ యందుంచిన ఈ నిరీక్షణ ఎన్నటికిని మమ్మును సిగ్గుపరచకుండునట్లు చేయుము. మా శ్రమ దినమున మేము క్రుంగకుండునట్లు మమ్మును బలపరచుము. పై చెప్పబడినట్లుగా, మేము ఈ లోక మహిమా నిరీక్షణ కొరకు కాకుండా, పరలోకములో ఉన్న ఆనందము కొరకు పరుగెత్తునట్లుగా మమ్మును మార్చుము. ఎటువంటి స్థితిలోను నిన్నే ఆశ్రయించునట్లు మాకు నీకృపను దయచేయుమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్. 

1800 425 7755 / 044-33 999 000