Loading...
Dr. Paul Dhinakaran

శాంతి సమాధానములతో తోడుకొనిపోవు దేవుడు!

Dr. Paul Dhinakaran
12 Jan
నా ప్రియులారా, నేడు ఈ సందేశము చదువుచున్న మీరు సమాధానమును మరియు సంతోషమును పొందుకోవాలని దేవుడు మీ పట్ల వాంఛ కలిగి యున్నాడు. అందుకే బైబిలేమంటుందో చూడండి, " మీరు సంతోషముగా బయలు వెళ్లుదురు. సమాధానము పొంది తోడుకొని పోబడుదురు...'' (యెషయా 55:12) అన్న వచనము ప్రకారము ఒక వ్యక్తి జీవితములో ఏది జరిగినను, ఆ కష్టమైన పరిస్థితిని అధిగమించడానికి ప్రభువు తన కృపను అనుగ్రహిస్తాడు మరియు ఆ వ్యక్తి ప్రభువును విశ్వసిస్తున్నందున, దేవుడు అన్నిటి మీద అతనికి అత్యధికమైన విజయమును అనుగ్రహిస్తాడు. ఆ తరువాత దైవీకమైన శాంతి మరియు సంతోషము కూడ కలుగును. తాత్కాలికమైన మరియు నశించిపోయే మార్గములలో ఈ లోకము అటువంటి సమాధానమును పొందాలని ఆశించుచున్నది. మీ జీవితములో మీరు ఎంతగానో విశ్వసించిన వ్యక్తి మిమ్మును వెన్నుపోటు పొడిచిన సమయమును మీరు ఎదుర్కొని యుండవచ్చును. " ఎవరిని నమ్మాలి? '' మరియు " ఎందుకు నమ్మాలి? '' అను ప్రశ్నలు మీ జీవితములో తలెత్తియుండవచ్చును. 

ఒక చిన్న పిల్లవాడు పొలంలో ఆడుకొనుచు నీళ్లు లేని ఒక లోతైన బావిలో పడిపోయి సహాయము కొరకు కేకలు వేశాడు. గ్రామస్థులు అది విని అక్కడికి వచ్చి, ఆ బావి లోపలికి ఒక తాడును విడిచి, దానిని పట్టుకొనమని చెప్పారు. కానీ, ఆ పిల్లవాడు " అయ్యా! తాడుకు అవతల ప్రక్కన నా తండ్రి ఉన్నాడా? '' అని అడిగాడు. అందుకు వారు " లేడు '' అని చెప్పారు. దానితో ఆ పిల్లవాడు, ' నా తండ్రి అవతల ప్రక్కన నిలబడియుంటేనే నేను తాడు పట్టుకొంటాను. నా తండ్రిని మాత్రమే నేను నమ్ముతాను!' అని చెప్పాడు. వెంటనే వారు ఆ పిల్లవాని తండ్రిని వెదకి తీసుకొని వచ్చారు. అప్పుడు ఆ తండ్రి, " కుమారుడా! ఇక్కడ నేను నిలువబడియున్నాను! తాడు పట్టుకో, నేను నిన్ను పైకి లాగుతాను '' అని చెప్పాడు. తండ్రి స్వరము వినగానే ఆ పిల్లవాడు సంతోషముతో తాడును గట్టిగా పట్టుకొన్నాడు. మరియు ఆ బావి నుండి బయటకు తీయబడ్డాడు!
ఆ పిల్లవానికి ఇతరుల బలముపై నమ్మకము లేదు! కానీ, అతను తన తండ్రి స్వరము వినగానే, " నా తండ్రి నన్ను నిశ్చయముగా విడువడు '' అని అనుకొన్నాడు. నా ప్రియులారా, యేసుపైన ఇటువంటి నమ్మకమునే కలిగియుండండి. ఆయన మిమ్మును ఎన్నడు విడువడు. నేడు ఈ సందేశమును చదువుచున్న మీరు సమస్యల బావిలో పడిపోయి ఉన్నప్పుడు, ఆయన యందు మాత్రమే పరిపూర్ణ విశ్వాసమును కలిగియుండండి. ఆయన మీ ప్రతి సమస్య నుండి మిమ్మును పైకి ఎత్తుతాడు. ఆయన మిమ్మల్ని తన పరిశుద్ధాత్మతో నింపిబడినప్పుడు, మీరు ఆయన స్వరూపములోనికి మార్చబడుచున్నారు. దేవుడు అనుగ్రహించు సమాధానమును మరియు ఆనందమును మీరు అనుభవించెదరు. అందుకు యేసు, " శాంతి మీ కనుగ్రహించి వెళ్లుచున్నాను; నా శాంతినే మీ కనుగ్రహించుచున్నాను; లోకమిచ్చునట్టుగా నేను మీ కనుగ్రహించుట లేదు; మీ హృదయమును కలవరపడనియ్యకుడి, వెరవనియ్యకుడి '' (యోహాను 14:27) అని చెబుతున్నాడు. దేని మీదను ఎక్కువ వాంఛ కలిగియుండకుండ, ప్రభువునందు విశ్వసించి, దైవిక ఆనందాన్ని అనుభవించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. 
Prayer:
ప్రేమగల పరలోకపు తండ్రీ, 

నీ యందే విశ్వాసముంచుచున్నాము. సమస్యల బావిలో నుండి మేము నీకు మొఱ్ఱపెట్టుచున్నాము. మా సమస్యల నుండి మాకు విడుదలను అనుగ్రహించుము. సమాధానము సంతోషములతో నిండిన రోజులను చూచుటకు మాకు సహాయము చేయుము. ప్రభువా, మనుష్యులను నమ్మి వేసారిపోయిన మా జీవితాలను నీ యొక్క దివ్యమైన హస్తాలకు సమర్పించుకొనుచున్నాము. శాంతిలేని మా జీవితాలలో నీ యొక్క దివ్యమైన శాంతి, అదియు లోకమివ్వలేని శాంతిని మాకనుగ్రహించుము. దేవా, మమ్మల్ని నీ పరిశుద్ధాత్మతో నింపి, నీ యొక్క స్వరూపమునకు మార్చి, నీవు అనుగ్రహించు సమాధానమును మరియు ఆనందమును మేము సంపూర్ణముగా అనుభవించునట్లు చేయుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రీ, ఆమేన్. 

1800 425 7755 / 044-33 999 000